

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ఒకటి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఈసారి మహేశ్ బాబుతో కలిసి భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డివోషనల్ అంశాలతో కూడిన ఈ సినిమా ప్రపంచాన్ని దాదాపు మూడు నిమిషాల గ్లింప్స్‌తో ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం దర్శకుడు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు, ‘వారణాసి’ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ థియరీ వైరల్ అవుతోంది. రాజమౌళి గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సినిమాలో ప్రస్తుత కాలంతో పాటు శ్రీరాముడు జీవించిన త్రేతాయుగానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇందులో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలోనూ కనిపించనున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న థియరీ ప్రకారం.. కుంభకర్ణుడు పునర్జన్మలో కుంభగా మారతాడట. ఈ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కదల్లేని స్థితిలో ఉన్న కుంభ.. తన సోదరుడు రావణుడికి చెందిన తొమ్మిది వజ్రాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాడట. రామ-రావణ యుద్ధ సమయంలో ఆ వజ్రాలు వేర్వేరు దేశాల్లో చెల్లాచెదురుగా పడిపోతాయని ఈ కథనం చెబుతోంది. వాటిని సేకరించేందుకు రుద్ర (మహేశ్ బాబు)ను కుంభ పంపిస్తాడట. ఈ క్రమంలో రుద్ర త్రేతాయుగంలోకి ప్రయాణించి కుంభ అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. దీంతో వజ్రాలు కుంభకు దక్కకుండా గతంలోనే యుద్ధ పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తాడట. అలా ప్రస్తుత కాలంలో కుంభకు వజ్రాలపై ఆశ లేకుండా చేస్తాడనేది ఈ థియరీ సారాంశం. అయితే ఈ కథకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి దీనిని ధ్రువీకరించని సోషల్ మీడియా ప్రచారంగానే చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!