

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణతో వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్:
ఈ సినిమా తనకు ఎంతో దగ్గరైందని, కుటుంబ కథను ఎంచుకుని విజయవంతం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. సూర్య నటనను ప్రశంసిస్తూ, ఆయనతో త్వరలో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సూర్య, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు ఈ చిత్రానికి నాలుగు ప్రధాన స్తంభాలుగా నిలిచారని అన్నారు. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వాన్ని మెచ్చుకున్న త్రివిక్రమ్. ఈ సినిమాకు నిజమైన హీరోలు ప్రేక్షకులేనని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య:
సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేనని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్యక్రమానికి రావడం సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చిందని తెలిపారు. వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన కళాకారులంతా కలిసి మంచి సినిమా చేశామని, కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులు మళ్లీ ఆదరణ చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సినిమాలను కేవలం వసూళ్లతో కొలవలేమని, ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే అసలు విజయం ఉంటుందని చెప్పారు.
వెంకీ అట్లూరి:
ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ అంతగా లేని సమయంలో ఈ కథను రూపొందించామని తెలిపారు. త్రివిక్రమ్, నిర్మాత వంశీ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్నిచ్చిందన్నారు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు రెట్టింపు కావడం తన కెరీర్‌లో తొలిసారి చూస్తున్నానని చెప్పారు. సినిమా విజయానికి, ముఖ్యంగా వసూళ్లకు సూర్యే ప్రధాన కారణమని పేర్కొంటూ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రవీనా టాండన్:
‘విశ్వనాథ్ & సన్స్’ విజయంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వెంకీ అట్లూరి ఎంతో వినయంగా, ప్రేమగా పనిచేస్తూ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టారని ప్రశంసించారు. సూర్యతో కలిసి పనిచేయడం, రాధిక శరత్‌కుమార్‌తో నటించడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!