

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌కు హాజరైన చిరంజీవి.. ఈ సినిమాలో నటి అనస్వర రాజన్ పోషిస్తున్న పాత్ర గురించి పరోక్షంగా కీలక హింట్ ఇచ్చారు. ఆమె నటనను ప్రశంసిస్తూ.. ‘‘కాకా సినిమాలో అనస్వర అద్భుతంగా నటించింది. అనస్వరా.. నీ పాత్ర గురించి మాట్లాడతావా? తను మాట్లాడదు.. మాట్లాడలేదు. మాట్లాడటం ఆమెకు నచ్చదు. నేను చెప్పిన ఈ మాటలను ఇంటికి వెళ్లాక గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అనస్వర ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో ఆమె మూగ అమ్మాయి పాత్రలో కనిపించనుందనే ప్రచారానికి చిరంజీవి వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. అంతేకాదు, ఇందులో ఆమె చిరంజీవి కుమార్తె పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే కార్యక్రమంలో దర్శకుడు వెంకీ కుడుముల గురించి కూడా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకీలో మంచి కామెడీ సెన్స్ ఉందని, అది తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ‘‘నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ వెంకీని మాత్రం అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అన్నాడు. అప్పటి నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు కథతో రాలేదు. నాకు హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు ‘ఇట్లు అర్జున’కు నిర్మాతగా మారాడు’’ అని నవ్వించారు. దీనికి స్పందించిన చిరంజీవి.. కథ చెప్పడానికి వస్తావా? లేక ఇంటి తలుపులు మూసేయనా? అని సరదాగా ప్రశ్నించారు. అందుకు వెంకీ కుడుముల.. ‘‘మీరు తలుపులు మూసేసినా.. నేను దూకి వచ్చి మీకు కథ వినిపిస్తా’’ అని బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణతో సక్సెస్ మీట్ నవ్వులతో సందడిగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!