

భారతదేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన ‘గొంధల్’ (Gondhal) సినిమాకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ క్యూ షీట్‌ను సిద్ధం చేయాలని అకాడమీ ప్రతినిధులు పలుమార్లు కోరినప్పటికీ, ఇళయరాజా అందుకు ఆసక్తి చూపలేదని దర్శకుడు సంతోష్ దవాఖర్ వెల్లడించారు. తాను ముందుగా రూపొందించిన క్యూ షీట్ ఆధారంగా సంగీతం చేయనని, సందర్భానికి అనుగుణంగా తన అనుభవం, భావనల ఆధారంగా స్వరాలు సమకూరుస్తానని ఇళయరాజా చెప్పినట్లు దర్శకుడు తెలిపారు. ఈ పత్రం అవసరమైతే చిత్ర బృందమే చూసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.
‘గొంధల్’ సినిమాకు మరాఠీ సంప్రదాయంలో పాతుకుపోయిన జానపద సంగీతం కావాలనే ఉద్దేశంతో ఇళయరాజాను సంప్రదించినట్లు సంతోష్ దవాఖర్ తెలిపారు. తక్కువ వాయిద్యాలతోనే అద్భుతమైన సంగీతాన్ని అందించగల ఆయన ప్రతిభను ప్రశంసించారు. కాగా, సినిమా కోసం ఉపయోగించిన సంగీతం, స్వరకర్తలు, నిడివి, సన్నివేశాల్లో సంగీతం వినిపించే సమయాన్ని వివరించే అధికారిక పత్రాన్నే మ్యూజిక్ క్యూ షీట్ అంటారు. ‘గొంధల్’ 2027 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అయితే ఈ ఎంపికతో సంగీత విభాగంలోనూ ఆస్కార్ నామినేషన్ వచ్చినట్లు కాదని స్పష్టత ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!