

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాల ఎంపికలో విభిన్న ప్రయోగాలు చేస్తుంటారు. అయితే వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల విషయంలో మాత్రం ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ సానిల్ కుమార్ వెల్లడించారు. గత 30 ఏళ్లుగా మమ్ముట్టితో పాటు మోహన్‌లాల్‌కు కూడా ఆడిటర్‌గా పనిచేస్తున్న ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను పంచుకున్నారు. భారీ వ్యాపారాలు ప్రారంభించడం, రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టడం మమ్ముట్టికి పెద్దగా ఇష్టం ఉండదని తెలిపారు. ఇతర సినీ ప్రముఖుల మాదిరిగా వ్యాపార రంగంలో విస్తరించకుండా, భూములు వంటి స్థిరాస్తులపై ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు.
అయితే మమ్ముట్టి పూర్తిగా వ్యాపారాలకు దూరంగా ఉండరని సానిల్ కుమార్ వివరించారు. తన కుమార్తె సురుమి, అల్లుడు డాక్టర్ మొహమ్మద్ రెహాన్ సయీద్‌తో కలిసి మాతృత్వ సంరక్షణ సేవలకు సంబంధించిన ఓ స్టార్టప్‌లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఆ సంస్థ అనంతరం ఓ విదేశీ కంపెనీ చేతికి వెళ్లడంతో వాటాదారులకు మంచి లాభాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాలు మినహా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచన మమ్ముట్టికి లేదని చెప్పారు. సంపాదించిన సంపదను భద్రంగా కాపాడుకోవడంలో ఆయనకు మంచి అవగాహన ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం ‘పడయాట్ర’తో పాటు ధనుష్ నటిస్తున్న ‘ఓమ్’ చిత్రంలోనూ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!