

2027 సంక్రాంతి సినిమా సందడి ఇప్పటి నుంచే మొదలైంది. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషలకు చెందిన భారీ ప్రాజెక్టులు కూడా పండగ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ‘కాకా’, ‘సంబరాల ఏటిగట్టు’, ‘మహాకాళి’, ‘జార్జిక్రిష్’ వంటి సినిమాలు సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. తాజాగా తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వేట్టువం’ కూడా పండగ సీజన్‌లో విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
ఆర్య, శోభిత ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వేట్టువం’ చిత్రాన్ని లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలమ్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఆఫ్ వేట్టువం’ గ్లింప్స్‌కు పలు భాషల్లో ప్రముఖ నటులు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో సౌబిన్ షాహిర్, కన్నడలో కిచ్చా సుదీప్ గొంతు కలిపారు. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఒకవైపు తెలుగు నేటివిటీ కథలు, మరోవైపు భారీ యాక్షన్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవనుండటంతో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!