

విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో 'ఇట్లు అర్జున' సినిమా దూసుకుపోతోంది. ప్రతిరోజూ కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లు సాధిస్తుండటం విశేషంగా మారింది. ముఖ్యంగా కొత్త హీరోగా పరిచయమైన అనీష్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సాధారణంగా తొలి సినిమాతో పరిచయమైన నటులపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు, ట్రోలింగ్ జరుగుతుంటాయి. ముఖ్యంగా లుక్స్, యాక్టింగ్ విషయంలో చాలా విమర్శలు వస్తుంటాయి. కానీ అనీష్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన లుక్స్,నటనను చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి చిత్రంలోనే విభిన్నమైన పాత్రను ఎంచుకుని తన ప్రతిభను నిరూపించుకున్నాడంటూ అభినందిస్తున్నారు. కొత్త హీరో అయినప్పటికీ నటనలో మంచి పరిణతి చూపించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా అనీష్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. తెరపై ఆయన చూపించిన నటన, భావోద్వేగాలను పలికించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కథలోని పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుని నటించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే సినిమా విడుదలైన తర్వాత వసూళ్లలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదని తెలుస్తోంది. కొత్త నటుడికి ఇలాంటి స్పందన రావడం చిత్రబృందానికి కూడా మంచి ఉత్సాహాన్ని అందిస్తోంది. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న అనీష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ఆసక్తి పెరుగుతోంది. రాబోయే చిత్రాల్లో కూడా ఇదే స్థాయి నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడా అనేది చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!