

తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. గతంలో ఈ చిత్రానికి జారీ చేసిన ‘A’ సర్టిఫికేట్ అనంతరం సీబీఎఫ్‌సీ సూచించిన మార్పులు, సవరణలను అమలు చేసిన చిత్రబృందం మళ్లీ రీ-సెన్సార్‌కు వెళ్లగా తాజాగా కొత్త సర్టిఫికేట్‌ను అందుకుంది. దీంతో నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడినట్టైంది.
తాజా మార్పులతో చిత్రంలో అదనంగా 41 సెకన్ల నిడివి చేరడంతో మొత్తం రన్‌టైమ్ 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లుగా ఖరారైంది. రాజకీయ నేపథ్య సన్నివేశాలు, కొన్ని కీలక ఘట్టాలపై వచ్చిన అభ్యంతరాల కారణంగా గత ఏడాది డిసెంబర్ నుంచి నిలిచిపోయిన ప్రక్రియ కోర్టులు, రివైజింగ్ కమిటీల దశలను దాటి ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లియరెన్స్ పొందింది. మరోవైపు చిత్రంలోని కొన్ని భాగాలు పైరసీకి గురవడం నిర్మాతల్లో ఆందోళన కలిగిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!