

నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తొలిసారి జంటగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో షో వ్యాఖ్యాత కరణ్ జోహార్ ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వ్యక్తిగత బంధంపై ఇతరులు తీర్పులు చెప్పడాన్ని తప్పుబట్టారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, అయితే ఒక జంట తమ సంబంధంలో ఎలా ఉండాలో చెప్పే అధికారం ఎవరికీ లేదని అన్నారు. “అసలు మీరెవరు? వారి కౌన్సిలరా? లాయరా? లేదంటే కుటుంబ సభ్యులా?” అంటూ విమర్శకులను ప్రశ్నించారు.
ఈ విమర్శల్లోకి రష్మిక, విజయ్ కుటుంబ సభ్యులను లాగడంపై కూడా కరణ్ అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల గురించి ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ వారి కుటుంబాలను కించపరచడం సరికాదని అన్నారు. షోలో సోఫాపై కూర్చున్నది వారి కుటుంబ సభ్యులు కాదని వ్యాఖ్యానించారు. గతంలో ‘కాఫీ విత్ కరణ్’ ఎనిమిదో సీజన్‌లో పాల్గొన్న దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, తమ వ్యక్తిగత జీవితం గురించి నిజాయతీగా మాట్లాడారని పేర్కొన్నారు. అలా మాట్లాడటాన్ని ఎప్పటి నుంచి తప్పుగా చూడటం మొదలుపెట్టారని ప్రశ్నించారు. కరణ్ వ్యాఖ్యలతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ మరోసారి చర్చనీయాంశమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!