

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్‌ను నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి వార్తల నేపథ్యంలో అనిరుధ్ వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా ఆయన సంపాదన, ఆస్తులపై కూడా ఆసక్తి పెరిగింది. ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం అనిరుధ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్లుగా చెబుతున్నారు. ఒక్కో సినిమాకు ఆయన రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు ఈ మొత్తం రూ.10–12 కోట్ల వరకు ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అల్లు అర్జున్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం ఆయనకు సుమారు రూ.25 కోట్ల ఆఫర్ వచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అనిరుధ్‌కు లగ్జరీ కార్లంటే కూడా ఇష్టమని తెలుస్తోంది. 2023లో ‘జైలర్’ సినిమా విజయవంతమైన సందర్భంగా సన్ గ్రూప్ ఛైర్మన్, కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆయనకు సుమారు రూ.1.1 కోట్ల విలువైన పోర్షే మకాన్ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. దీనితో పాటు బీఎండబ్ల్యూ iX1 LWB, మహీంద్రా BE 6, ఫోర్డ్ మస్టాంగ్ GT వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సంగీత రంగానికే పరిమితం కాకుండా అనిరుధ్ వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. 2024లో దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ, స్నాక్స్ బ్రాండ్ VS Mani & Coలో సహ వ్యవస్థాపకుడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బ్రాండ్ విస్తరణ, మార్కెట్ వాటా పెంపు లక్ష్యంగా ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆయనకు కంపెనీలో ఈక్విటీ వాటా కూడా లభించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!