

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు శిఖంజా మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని, మోహన్‌బాబు, శ్రీకాంత్ ఓదేల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు సరదాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
శ్రీకాంత్ కథ చెప్పడానికి తన వద్దకు వచ్చినప్పుడు తన పాత్రకు భార్య ఉంటుందని, ఆమెతో కలిసి పలు సన్నివేశాలు ఉంటాయని చెప్పారని మోహన్‌బాబు తెలిపారు. ఆ పాత్రకు పాత హీరోయిన్లను కాకుండా కొత్తవారిని తీసుకోవాలని తానే సూచించానని, దర్శకుడు కూడా అందుకు అంగీకరించాడని చెప్పారు. అయితే షూటింగ్ ప్రారంభమై ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా భార్య పాత్రకు సంబంధించిన ఒక్క సన్నివేశం కూడా తీయలేదని గుర్తించినట్లు తెలిపారు. దీనిపై శ్రీకాంత్‌ను అడగ్గా.. తొలుత అనుకున్న సన్నివేశాల్లో మార్పులు చేశామని, అందువల్ల భార్య పాత్రను తొలగించామని చెప్పారని మోహన్‌బాబు వివరించారు. దీంతో దర్శకుడు తనను మోసం చేశాడంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించగా, నాని, శ్రీకాంత్ ఓదేల నవ్వుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!