

సినిమా ప్రారంభ సమయం దాటిన తర్వాత కూడా 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ప్రచార ట్రైలర్లు ప్రదర్శించడంతో ఓ ప్రేక్షకుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 2025 జూన్ 20న ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాను చూసేందుకు రాత్రి 10:35 గంటల షోకు రెండు టికెట్లు బుక్ చేసుకున్న సదరు ప్రేక్షకుడు, నిర్ణీత సమయానికి థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్నప్పటికీ రాత్రి 10:52 వరకు ప్రకటనలు, ట్రైలర్లు కొనసాగాయని ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా ఆలస్యంగా ప్రారంభమై, ఇంటికి చేరేసరికి రాత్రి 3 గంటలైందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్.. ప్రేక్షకుల సమయాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వృథా చేయడం సేవాలోపం, అనుచిత వ్యాపార పద్ధతిగా పేర్కొంది. థియేటర్ యాజమాన్యం ప్రకటనలు, ట్రైలర్లు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కు అని వాదించినప్పటికీ కమిషన్ ఆ వాదనను అంగీకరించలేదు. బాధిత ప్రేక్షకుడికి రూ.20 వేల నష్టపరిహారం, రూ.5 వేల న్యాయ ఖర్చులు చెల్లించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50 వేల జరిమానా జమ చేయాలని ఆదేశించింది. దీంతో థియేటర్లలో నిర్ణీత సమయానికి మించి ప్రకటనలు ప్రదర్శించే తీరుపై ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!