

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా నభా నటేష్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారనే ప్రచారం మొదలైంది. తొలుత ఆమెను ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేశారనే వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు ఆమె పాత్ర మరింత ప్రాధాన్యంతో ఉండబోతుందనే సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

సినిమాలో కమర్షియల్ హంగులను పెంచే ఉద్దేశంతో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ పాటలో నభా నటేష్ గ్లామర్ ఆకర్షణగా నిలవనున్నారట. అయితే ఆమె పాత్ర కేవలం పాటకే పరిమితం కాకుండా కథలో కీలక మలుపుకు కారణమవుతుందనే టాక్ వినిపిస్తోంది. రవితేజతో కలిసి పలు ముఖ్యమైన సన్నివేశాల్లో ఆమె కనిపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కథ తన కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని రవితేజ పేర్కొనడం సినిమాపై ఆసక్తిని పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నకాస్త్ర నటిస్తుండగా, చిత్రీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!