

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు జంటగా తెరకెక్కిన క్లాసిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నిన్నే పెళ్లాడతా’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1996 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను అందంగా మేళవించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నాగార్జున కోసం కృష్ణవంశీ తొలుత యాక్షన్ కథను సిద్ధం చేసినప్పటికీ, ఆ కథను పక్కనపెట్టి ప్రేమ, కుటుంబ సంబంధాల నేపథ్యంలో ‘నిన్నే పెళ్లాడతా’ కథను రూపొందించారు. మొదట ఈ చిత్రానికి ‘శీను–పండు’ అనే టైటిల్‌ను అనుకున్నప్పటికీ, నాగార్జున సూచనతో ‘నిన్నే పెళ్లాడతా’ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
మహాలక్ష్మి పాత్ర కోసం సుమారు 65 మంది హీరోయిన్లను పరిశీలించిన అనంతరం టబును ఎంపిక చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్స్ నిర్మించి చిత్రీకరణ జరిపారు. సందీప్ చౌతా అందించిన సంగీతంలో ‘ఏటో వెళ్లిపోయింది మనసు’, ‘గ్రీకు వీరుడు’, ‘కన్నుల్లో నీ రూపమే’ వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, నంది తదితర పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం మూడు దశాబ్దాలు పూర్తయినా తన ప్రత్యేకతను కోల్పోలేదు. శీను–పండు ప్రేమకథ, నాగార్జున–టబు కెమిస్ట్రీ ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానులకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకంగా నిలిచాయి. సినిమా కవరేజ్ కోసం లొకేషన్‌కు వెళ్లిన సమయంలో పలువురు ఆర్టిస్టులతో సందడి నెలకొనేదని చిత్ర యూనిట్ అనుభవాలను గుర్తుచేసుకుంటోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!