

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మన్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రజనీకాంత్, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలను రజనీకాంత్ బృందం ఖండించింది. ఆయన మేనేజర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, తాను స్వయంగా చిత్రీకరణను పరిశీలించానని, రజనీకాంత్ సంతోషంగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు చురుకైన పనితీరుతో షూటింగ్ సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
మైసూరులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ఓ పోస్టు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, చిత్రబృందానికి చెందిన ఎవరూ ఆ ఆరోపణలను ధ్రువీకరించలేదు. తాజాగా రజనీ మేనేజర్ ఇచ్చిన వివరణతో ఈ ప్రచారానికి స్పష్టత వచ్చింది. దర్శకుల మార్పులపై గతంలో చర్చకు వచ్చిన ధర్మన్ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించారు. సిమ్రాన్, రాశీఖన్నా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!