

టాలీవుడ్‌లో అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం సుదీర్ఘకాలం కొనసాగుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా విడుదల తేదీలు మారుతుండటంతో ప్రేక్షకుల నిరీక్షణ కూడా పెరుగుతోంది. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2023 నవంబర్‌లో ప్రారంభమైంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తికాకపోవడంతో ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రీకరణ 275 రోజుల తర్వాత పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాక’ చిత్రీకరణ 2027 మార్చి వరకు కొనసాగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా విడుదల 2028కి వాయిదా పడవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మాత్రం 2027 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇలా అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్నాయి. అయితే నిర్మాణానికి ఎక్కువ సమయం కేటాయించినంత మాత్రాన సినిమా విజయం సాధిస్తుందనే హామీ లేదు. బలమైన కథ, ఆసక్తికరమైన కథనం, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. మరి ఈ భారీ చిత్రాలు అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తగిన ఫలితాన్ని అందిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!