

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. ప్రజల కోసం పోరాడిన వీరులు, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఆక్రమించిన తీరును ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించడమే ఈ సినిమా ఉద్దేశమని విజయ్ దేవరకొండ తెలిపారు. అనంతపురంలోని ఓ జాతరలో విన్న బుర్రకథల ఆధారంగా దర్శకుడు ఈ కథను రూపొందించారని, సినిమా కూడా బుర్రకథతోనే ప్రారంభమవుతుందని చెప్పారు.
‘రణబాలి’ కోసం రాయలసీమ యాస, గుర్రపు స్వారీ నేర్చుకోవడం సవాలుగా అనిపించిందని విజయ్ వెల్లడించారు. సినిమాలో రణబాలి, జయమ్మ పాత్రల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచడం తనకు ఇష్టం లేదని, నిర్మాతలకు సాధ్యమైనంత వరకు ధరల పెంపు లేకుండా చూసుకోవాలని సూచిస్తానని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల యాసలను కామెడీ లేదా ప్రతినాయక పాత్రలకే పరిమితం చేయకుండా, వాటిలోని హీరోయిజాన్ని చూపించే ప్రయత్నాలు జరగాలని అభిప్రాయపడ్డారు. సరైన పాత్ర లభిస్తే బయోపిక్‌లో నటించడానికి సిద్ధమని కూడా చెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!