

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సంపత్ నంది మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలుత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తెరకెక్కాల్సి ఉండగా, చివరి నిమిషంలో సంపత్ నంది ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో దర్శకుడు బాబీ కొల్లి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్లే సంపత్ నంది సినిమా నుంచి బయటకు వచ్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన సంపత్ నంది.. తానే మొదట ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యానని, కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యమైందని స్పష్టం చేశారు.
సినిమా ప్రారంభానికి మరికొంత సమయం పడుతుందని ఒకరోజు పవన్ కళ్యాణ్ తనను పిలిచి మాట్లాడారని సంపత్ నంది గుర్తుచేసుకున్నారు. అప్పటివరకు వేచి ఉండగలరా అని పవన్ అడిగారని, అయితే తాను అప్పటికే మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పినట్లు వెల్లడించారు. దీనికి పవన్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఆయన అనుమతితోనే సమయం వృథా చేసుకోకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని వివరించారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తనతో సినిమా చేసేందుకు ప్రయత్నించారని, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. పవన్‌తో కలిసి ఆ సినిమా కోసం పనిచేసిన కొద్ది రోజులు తన జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయని సంపత్ నంది భావోద్వేగంగా పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!