

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ‘బీయింగ్ ది సల్మాన్ ఖాన్’ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా తనదైన నటన శైలి, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, డైలాగ్ డెలివరీ వంటి అంశాలను నేర్పించే చిన్న వీడియోలను అందిస్తున్నారు. అక్టోబర్ 9న ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ ఛానల్ను ప్రకటించిన సల్మాన్ ఖాన్.. ‘మొదటి నుంచి మొదలుపెడదాం. ఇది నా అధికారిక యూట్యూబ్ ఛానల్. ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఇక్కడే ఉంటాయి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోల్లో సల్మాన్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఒక పాత్రలో నటన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన శిక్షణ ఇచ్చే కోచ్గా, మరో పాత్రలో తనదైన నటన శైలిని నేర్చుకునే విద్యార్థిగా అలరిస్తున్నారు.
ఈ ఛానల్ పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు సల్మాన్ ఖాన్ అక్టోబర్ 10న స్పష్టం చేశారు. వినోదం, ప్రేమ, కుటుంబ విలువలతో పాటు పిల్లలకు విద్య కూడా అవసరమని పేర్కొన్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం, అక్టోబర్ 11 నాటికి ఈ ఛానల్లో 11 వీడియోలు అప్లోడ్ కాగా, అధికారిక ప్రకటన వెలువడిన గంటలోపే 14,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు చేరారు. అయితే, వీడియోలను క్రమం తప్పకుండా ఎప్పుడు అప్లోడ్ చేస్తారనే విషయంపై సల్మాన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలోనే సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పేరుతో ఆయన నిర్మాణ సంస్థ ప్రత్యేక యూట్యూబ్ మ్యూజిక్ ఛానల్ను నిర్వహిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!