

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన బాధ్యతలు ఉండాలని నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అభిప్రాయపడ్డారు. తండ్రి పిల్లలకు అన్నం తినిపించినా, డైపర్ మార్చినా సమాజం గొప్పగా చూస్తుందని, అదే పనిని తల్లి చేస్తే ఎందుకు ప్రత్యేకంగా అభినందించరని ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ఉపాసన ముచ్చటించారు. ఈ సందర్భంగా పేరెంటింగ్, కుటుంబ బాధ్యతలపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తండ్రి పిల్లల బాధ్యతలు చూసుకోవడం ఎవరికో చేస్తున్న సహాయం కాదని, అది ఆయన బాధ్యత అని ఉపాసన పేర్కొన్నారు. సమానత్వం అనేది మన ఆలోచనల్లోనే కాకుండా విద్యా విధానంలోనూ భాగం కావాలని, పిల్లలను కూడా అదే భావనతో పెంచాలని సూచించారు. కొడుకు ఇంటి పనులు చేసినప్పుడు తల్లులు దాన్ని అసాధారణమైన విషయంగా చూడకూడదన్నారు. గతంలో తనకు కూడా భర్త పిల్లలకు అన్నం తినిపిస్తుంటే ముచ్చటగా అనిపించేదని, అయితే ఇప్పుడు అది సాధారణ విషయమని అర్థం చేసుకున్నానని చెప్పారు. రామ్‌చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకోగా, వారికి క్లీంకారతో పాటు ఇటీవల కవలలు జన్మించారు. కుమారుడికి శివరామ్, కుమార్తెకు అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!