

బాలీవుడ్ యువ నటి శార్వరి తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘యే ప్రేమ్ మోల్ లియా’లో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా ఆమె నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు తన అభిమాన నటి, అందాల తార మాధురి దీక్షిత్‌తో కలిసి శార్వరి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా మాధురితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రావడం తనకు కల నిజమైనట్లుగా ఉందని శార్వరి భావోద్వేగానికి గురయ్యారు. సూరజ్ బర్జాత్యా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి మాధురి నుంచి ఇంతటి ప్రేమాభిమానాలు పొందడం తనకు గొప్ప గౌరవమని పేర్కొన్నారు.
మాధురి దీక్షిత్‌ను ఉద్దేశించి ‘మీరు నిజంగా అత్యుత్తములు’ అంటూ శార్వరి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ చిత్రంతో మాధురి ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు శార్వరి రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేషమియా సంగీతం అందిస్తున్నారు. భారతీయ పండుగలు, వివాహ వేడుకలు, ఉమ్మడి కుటుంబాల అనుబంధాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, సుప్రియా పాఠక్, సీమా పహ్వా, సౌమ్య టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!