

పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సిరీస్ ‘బచాయ్ హై సంగ్ సమైత్ లో’ భారత్‌లో వివాదానికి దారితీసింది. ఈ సిరీస్‌ను దేశంలో స్ట్రీమింగ్ చేయకుండా నిషేధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించినట్లు తెలుస్తోంది. భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేయకుండా చూడాలని ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం మరోసారి సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2025 మే 8న జారీ చేసిన అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ అడ్వైజరీని జారీ చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా ఇతర కంటెంట్‌ను తొలగించాలని డిజిటల్ వేదికలకు సూచించింది.
ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హనియా ఆమిర్, సమన్ అన్సారీ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ సిరీస్ భారత్‌లో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అన్ని ఓటీటీ వేదికలు 2025 మే 8న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీకి కట్టుబడి ఉండేలా చూడాలని కోరింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత నిబంధనలు తీసుకురావాలని కూడా తన లేఖలో విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!