

2013లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే చూడవచ్చు. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.
ముంబైకి చెందిన మానవ హక్కుల న్యాయవాది, కార్యకర్త షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన పలువురి తరఫున ఆయన న్యాయపోరాటం చేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయం అందించేందుకు షాహిద్ అజ్మీ చేసిన ప్రయత్నాలను సినిమాలో చూపించారు. 2010లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలోని కీలక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు పురస్కారాలు లభించాయి. హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడు, రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడు అవార్డులు దక్కాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!