

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి అవకాశం దక్కని బీసీలు, ఇతర నేతలతో శనివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో పార్టీ నుంచి మరిన్ని అవకాశాలు ఉంటాయని, టికెట్ రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని వారికి సూచించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తే కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని సమావేశంలో నేతలు కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కని బీసీ కులాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఇప్పటివరకు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు, ప్రాంతాలకు పదవులు, టికెట్ల కేటాయింపులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలోని మూడు స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరగా, కనీసం రెండు స్థానాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, మూడో స్థానంపైనా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని మహేశ్‌కుమార్‌గౌడ్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓబీసీల కులగణన డిమాండ్‌పై ఆదివారం శంషాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. SIRపై దేశవ్యాప్తంగా ఇండియా కూటమి చేపట్టనున్న ఉద్యమంపై చర్చించేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!