

పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినాశ్ రెడ్డి కావాలనే ఉద్రిక్తతలు సృష్టించి, ఆ నెపాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింహాద్రిపురం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అవినాశ్ రెడ్డి 30 నుంచి 50 వాహనాలతో సింహాద్రిపురానికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పట్టణ ఓటరైన ఎంపీ.. సింహాద్రిపురం ప్రాంతానికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని నిలదీశారు.
శుక్రవారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి స్వగ్రామమైన సింహాద్రిపురం మండలంలో ఎంపీ అవినాశ్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో అంకాలమ్మ గూడూరు సమీపంలో అవినాశ్ రెడ్డి, బీటెక్ రవికి చెందిన వాహనాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, పరస్పరం రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో మున్సిపాలిటీలో జరిగిన కాల్పుల ఘటనతో పాటు తాజా ఘటనపైనా సమగ్ర విచారణ జరిపించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. అవినాశ్ రెడ్డి, దుశ్యంత్ రెడ్డిల పాత్రపై కూడా విచారణ జరగాలని కోరుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!