

మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించడంతో పాటు, దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆ పునాదుల వల్లే భారతీయ యువత ప్రపంచస్థాయి సంస్థల్లో ఉన్నత పదవులకు చేరుకుంటున్నారని అన్నారు.
ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని, ఆధునిక సదుపాయాలతో రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, బ్లూ కాలర్ ఉద్యోగాలపై మాత్రం అంతటి ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సిఫార్సుల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో మైనారిటీలు, ఎస్టీలు, ఆదివాసీలు, పేదల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చిన ఆయన, రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించి కేంద్రంలో అధికారం నుంచి దించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!