

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం కీలక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఎన్నికల సంఘం వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు, పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల సంఘంలో తలెత్తినట్లు వచ్చిన భిన్నాభిప్రాయాలు, ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన అంశాలు, ఫామ్-6లో మార్పులు, ఓటర్ల నమోదు ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆయనపై చర్యకు పార్టీ అనుసరించాల్సిన రాజకీయ, న్యాయపరమైన మార్గాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముంది. ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్త ఆందోళనలు, న్యాయపోరాటం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!