

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్పీ) ఈ ప్రతిపాదనకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ నేత జితేంద్ర అవ్హాద్ మాట్లాడుతూ డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన అవసరమని, ఈ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచాలన్నది తమ షరతు అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే మాత్రం బిల్లులోని పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే పార్లమెంట్‌లో తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయంపై చర్చకు దారితీశాయి.
మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య వాటా తగ్గకుండా చూడాలని డీఎంకే పట్టుబడుతోంది. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల వాటాను కాపాడటంతో పాటు, రాష్ట్రాల వారీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆ పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన వైఖరిని పునరుద్ఘాటించారు. అయితే కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లు ప్రతిపాదిత బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మిత్రపక్షాల వైఖరిపైనా అసంతృప్తి వెలిబుచ్చుతున్నాయి. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శిస్తూ, దీనికి మద్దతు ఇవ్వడాన్ని దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డీలిమిటేషన్‌పై భిన్న వైఖరులు తీసుకుంటున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో ఐక్యత, సమన్వయం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!