

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత 50 శాతం స్థానాల పెంపు అమలైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి చెందిన లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి చేరవచ్చు. దేశవ్యాప్తంగా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కు పెంచాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఈ మార్పులు వెంటనే అమల్లోకి రావు. పార్లమెంట్ ఆమోదం, అవసరమైన రాజ్యాంగ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతారు. నియోజకవర్గాల సరిహద్దుల మార్పునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాలు 263కు పెరిగితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠ మంత్రుల సంఖ్య ప్రస్తుత 26 నుంచి సుమారు 39కు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచడంతో ప్రజాప్రాతినిధ్యం మరింత విస్తరించనుంది. రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల ప్రస్తుత నిష్పత్తిని 2051 వరకు కొనసాగించేలా కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ బిల్లులు పార్లమెంట్‌లో అవసరమైన ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందడంతో పాటు, రాజ్యాంగ సవరణకు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానాల పెంపును ఖరారైన నిర్ణయంగా పరిగణించరాదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!