

రైతులు పండించిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించడంలో ప్రధాని నరేంద్ర మోదీ, వరి ధాన్యం, సోయా పంటలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలో ఆదివారం రాత్రి మాజీ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ, రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. భారాస పదేళ్ల పాలనలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని, రైతుబంధు, రైతు బీమా పథకాలు సమర్థంగా అమలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎల్‌నినో పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు.
రైతులకు సాగునీరు, విద్యుత్తు అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్నా పాలమూరు ప్రాంతానికి నీటిని అందించలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలని సూచించిన విశ్రాంత ఇంజినీర్లపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఏడాది ఓపిక పడితే మళ్లీ భారాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అంతకుముందు నేరడిగొండ, తలమడుగు మండలాల్లో పర్యటించిన కేటీఆర్.. ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ ప్రమాదంలో మరణించిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎన్‌ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేను భారాసలోకి ఆహ్వానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!