

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎలాంటి గుర్తింపు ఉందో, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్ మాఫియా సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అభివృద్ధి కోసం భూములు కొనుగోలు చేసిన తర్వాత కోర్టు వివాదాల కారణంగా బిల్డర్లు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు, నరెడ్కో సమన్వయంతో ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. రియల్ ఎస్టేట్ రంగం ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలని, చిన్న సంస్థలను ప్రోత్సహించి కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచే బాధ్యతను నరెడ్కో తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మందికి ప్రయోజనం చేకూర్చే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని, హైదరాబాద్ అనుసంధానతను పెంచేందుకు మూడు ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించిన ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల విషయంలోనూ కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. అనంతరం ప్రాపర్టీ షోలో ఉత్తమ స్టాల్స్ ఏర్పాటు చేసిన సంస్థలకు కిషన్‌రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో నెక్ట్స్ జెన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు కె.శ్రీధర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్.వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!