

లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం దిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవడంతో పాటు జైలుకు వెళ్లడం ఖాయమని, ఆ తర్వాత తమ లక్ష్యం మోదీ, అమిత్ షాలేనని వ్యాఖ్యానించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఎన్నికల అక్రమాలకు పాల్పడినవారు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. తాము ద్వేషం, హింసను నమ్మేవాళ్లం కాదని, ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి పలువురు ఇండియా కూటమి నేతలు ఓపెన్ టాప్ వాహనాల్లో ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ సహా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో ఏళ్ల తరబడి ఓట్ల చోరీ జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటర్ల జాబితాల్లో అక్రమాల ద్వారా ఓట్లు చోరీ చేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాల నుంచి 13.5 కోట్ల మంది పేర్లు తొలగించారని పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ప్రజల ఓటు హక్కుకు భంగం కలుగుతోందని, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై విమర్శలు చేశారు. ఈ ఆరోపణలను తీవ్ర నేరంగా అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ దేశంలోని వివిధ వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ఆరోపించిన ఆయన, దేశ సంపద కొద్దిమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తోందని విమర్శించారు. సంపన్నులకు, సామాన్యులకు వేర్వేరు న్యాయాలు ఉండకూడదని అన్నారు.
ఈ సభలో వినిపిస్తున్నది రాజకీయ పార్టీల గొంతు మాత్రమే కాదని, దేశ యువత, రైతులు, కార్మికుల ఆకాంక్షలకు ప్రతిరూపమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకుంటామని, రాజ్యాంగానికి ఎలాంటి నష్టం కలగనివ్వబోమని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షాల మాదిరిగా విద్వేషాన్ని పెంచకుండా ప్రేమ, ప్రజాస్వామ్య విలువలతో దేశాన్ని సరైన దిశలో నడిపిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరోసారి హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!