

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం ఆయన నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు అవసరమైన ప్రత్యేక నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలని రామచంద్రరావుకు సూచించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలపై అసెంబ్లీలో అన్ని పార్టీలకు అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని, ప్రతి కీలక అంశంపై సమగ్ర చర్చ అనంతరమే నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటానే కేంద్రం విడుదల చేస్తోందని, వాటిని ఉపకారాలుగా చూపించడం సరికాదన్నారు. అనవసర విమర్శలు మానేసి కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంపై బీజేపీ దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!