

ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనున్న భారత మహిళల కబడ్డీ జట్టుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన మాజీ స్టార్ క్రీడాకారిణి నీతా దడ్వే హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. జపాన్‌లోని ఐచీ-నగోయా నగరాల్లో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. కబడ్డీ పోటీలు ఈ నెల 21 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నీతా, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆమె శిక్షణలోనే భారత జట్టు 2016 దక్షిణాసియా క్రీడల్లోనూ బంగారు పతకం సాధించింది.
క్రీడాకారిణిగా ఎస్‌సీ రైల్వేస్ కోచ్ ధనం రెడ్డి వద్ద శిక్షణ పొందిన నీతా, 14 ఏళ్లపాటు ఇండియన్ రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఎనిమిదేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు పలు జాతీయ చాంపియన్‌షిప్ టైటిళ్లు అందించారు. 1996లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్న ఆమె 2004లో ఆటకు వీడ్కోలు పలికి, 2011లో కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కబడ్డీలో ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పుడూ ఆధిపత్యం చలాయించిందని, ఈసారి కూడా అదే జోరును కొనసాగించి స్వర్ణ పతకంతో తిరిగి వస్తామనే నమ్మకం ఉందని 54 ఏళ్ల నీతా తెలిపారు. ప్రస్తుతం బళ్లారిలో భారత జాతీయ జట్టు శిబిరం కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!