

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీకి భారత చరిత్ర, సంప్రదాయాలపై అవగాహన ఉన్నందునే యూపీఏ చైర్‌పర్సన్‌గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారని అన్నారు. కరీంనగర్‌లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ ప్రకటించారని, ఆమె కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు లేదని, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి రాకుండా ప్రజలే అడ్డుకున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందని ఆరోపిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల విభజనతో బీజేపీకి లాభం చేకూరిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా, పంట బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలను అమలు చేస్తున్నామని చామల తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకుండా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనే షరతు పెట్టడం సరికాదన్నారు. ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్-2, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించిన చామల, బండి సంజయ్ సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!