

కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సనత్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట నీలిమపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు అనైతికమైనవని పేర్కొంటూ, వాటిని వెంటనే ఉపసంహరించుకుని నీలిమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఒవైసీ రాజకీయ కార్యకలాపాలపై రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా చేసిన విమర్శలకు ఒవైసీ రాజకీయంగానే సమాధానం చెప్పాల్సిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకు భిన్నంగా ఖేరా సతీమణి కోట నీలిమను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం రాజకీయ దిగజారుడుతనమని విమర్శించారు. నీలిమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన మహిళా నాయకురాలని పేర్కొన్నారు. పవన్ ఖేరాను విమర్శించే హక్కు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు, తమ రాజకీయాలతో విభేదించే స్వేచ్ఛ ఒవైసీకి ఉన్నాయని, అయితే రాజకీయ కక్షల కోసం ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!