

తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు వైఎస్ షర్మిల తన వద్దకు రావడాన్ని కూడా ‘సాక్షి’ పత్రిక రాజకీయం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక కుటుంబ వేడుకకు ఆహ్వానించేందుకు వచ్చిన విషయాన్ని రాజకీయ కోణంలో చూపించడం సరికాదని మండిపడ్డారు. వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలను ముడిపెట్టి బాధ్యతారహితంగా వార్తలు రాయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ గతంలో వైఎస్ కుటుంబంతో తనకున్న పరిచయాలను గుర్తుచేశారు.
గతంలో షర్మిల వివాహానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా తనను ఆహ్వానించారని, తాను ఆ పెళ్లికి హాజరైనట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే జగన్‌మోహన్ రెడ్డి వివాహానికి కూడా తాను పులివెందుల వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. తమ మధ్య ఉన్నది కేవలం రాజకీయ విభేదాలేనని, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. రక్తం పంచుకున్న సొంత చెల్లి ఒక శుభకార్యానికి ఆహ్వానించేందుకు వస్తే, దానిపై కూడా బాధ్యతారహితమైన కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాలకు, వ్యక్తిగత కుటుంబ సంబంధాలకు మధ్య తేడాను గుర్తించాలని హితవు పలికారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!