

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ‘ఎడ్యుకేషన్ జిహాద్’ పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని చేత మతపరమైన ప్రార్థనలు రాయించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన ఆందోళనకరమని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం చర్యలను ఖండిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం, విద్యాశాఖ ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కేవలం ఒక ఉపాధ్యాయుడిపై చర్యలు సరిపోవని, పూర్తి బాధ్యత పాఠశాల నిర్వహణదేనని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన విషయాలను రుద్దకూడదని, ప్రతి విద్యార్థి హక్కులను గౌరవించాలని అన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!