

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల త్యాగాలను గుర్తించి స్థానిక ఎన్నికల్లో వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నేతలకు సూచించారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, గిరిజన గ్రామాలకు రహదారులు కల్పించి విద్య, వైద్యం, ఉపాధి, రవాణా సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం కింద 1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో 2,569 పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
గిరిజన రైతులకు ఆదాయం పెంచేందుకు 85 వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి సుమారు 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మొబైల్ కనెక్టివిటీ, తాగునీరు, వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ పనిముట్ల పంపిణీ కోసం రూ.68 కోట్లతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు, అర్హులైన రైతులకు సబ్సిడీపై పరికరాలు అందిస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. రహదారుల నాణ్యతను ప్రజలు పర్యవేక్షించాలని, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!