

నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. సభకు ప్రజలను ఆహ్వానిస్తూ జమ్మికుంట పట్టణం, వీణవంక మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కేసీఆర్ నిరాహార దీక్ష కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ సభకు నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!