

తమిళనాడులో సినిమా, రాజకీయాలకు ఎప్పటినుంచో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీ రామచంద్రన్, ఎం. కరుణానిధి, జె. జయలలిత నుంచి ప్రస్తుతం విజయ్ వరకు పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. చెన్నైలో జరిగిన సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్. వీరమణి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.
అయితే ఈ వార్తలపై సూర్య బృందం వెంటనే స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, సమావేశంలో వీరమణి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని తెలిపింది. అలాగే అగరం ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సూర్య తన రాబోయే పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారని, ఆయన సేవా కార్యక్రమాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!