

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో దిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల అమలుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మద్దతుకు ప్రతిఫలంగా శరద్ పవార్ కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మహారాష్ట్రలో ఇండియా కూటమి మరింత బలహీనపడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక పదవులను ఎన్‌సీపీ (ఎస్‌పీ) కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్థిక శాఖ సహా రెండు ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలపై ఆ పార్టీ ఆసక్తి చూపుతున్నట్లు, ఒక శాఖకు జయంత్ పాటిల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పూర్తి ముసాయిదాను పరిశీలించిన తర్వాతే తమ వైఖరిని వెల్లడిస్తామని సుప్రియా సూలే ఇటీవల స్పష్టం చేశారు. ఇండియా కూటమి చేపట్టిన ఎస్‌ఐఆర్ వ్యతిరేక ఆందోళనల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో కేంద్రానికి సానుకూల సంకేతాలు ఇస్తున్నారనే ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అనారోగ్యం కారణంగా ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావడం లేదని తెలిపిన ఆమె.. సోమవారం దిల్లీ వెళ్లి పార్లమెంట్ చర్చల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఎన్‌సీపీ (ఎస్‌పీ)కి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. పార్టీలో చీలికను నివారించేందుకు బిల్లుకు మద్దతు ఇవ్వడం కీలకమని శరద్ పవార్ కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పవార్ అభిప్రాయపడినట్లు జితేంద్ర అవ్హాద్ పేర్కొన్నారు. మరోవైపు, శరద్ పవార్ రాజ్యసభకు వెళ్లేందుకు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన సహకరించాయని గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏం జరుగుతోందంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పరోక్షంగా ప్రశ్నించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!