

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. తొలుత దర్శకుడి విషయంలో మార్పులు చోటుచేసుకోగా, ఆ తర్వాత కథలోనూ పలు సవరణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది. ఇప్పుడు కథానాయిక ఎంపిక కూడా చిత్రబృందానికి కొత్త తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గతంలో నటుడు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధా మేకను పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. అయితే సినిమా ఆలస్యం కావడంతో పాటు ఇతర కారణాల వల్ల ఆ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం మేధా మేక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మైత్రీ ఇన్ లవ్ చిత్రంతో కథానాయికగా పరిచయం కాబోతోంది. జై జాస్తి హీరోగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక మోక్షజ్ఞ తొలి సినిమా కోసం ఓ ప్రముఖ కథానాయికను ఎంపిక చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీలీల పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే దర్శకుడు, కథ విషయంలో మార్పులు చూసిన అభిమానులకు ఇప్పుడు కథానాయిక ఎంపికపై వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరి చివరకు మోక్షజ్ఞ సరసన నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!