

అత్యాధునిక కంప్యూటర్ చిప్స్‌ను అక్రమంగా చైనాకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సంస్థపై చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విభేదాలు బయటపడ్డాయి. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థను అమెరికా వాణిజ్య శాఖ ఎంటిటీ లిస్ట్‌లో ఎందుకు చేర్చలేదని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ను ప్రశ్నించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ ప్రభావంతో ఈ సంస్థ పనిచేస్తోందనే అనుమానాల నేపథ్యంలో ఈ అంశంపై గత వారం వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో చర్చ జరిగినట్లు సమాచారం. చిప్స్ సరఫరాపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని లుట్నిక్ చెప్పినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ అంశంపై చర్చించేందుకు అధికారులు ట్రంప్‌ను కలవగా, ఆయన స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
మెగాస్పీడ్‌పై ఆంక్షలు విధిస్తే చైనాతో మరోసారి వాణిజ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని లుట్నిక్ హెచ్చరించినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే ఆంక్షలకు మస్క్ మద్దతు తెలిపినట్లు, దీంతో ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు అమెరికా మీడియా పేర్కొంది. గతంలోనూ చైనాకు ఎన్విడియా ఏఐ చిప్స్ అక్రమంగా తరలిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునే ప్రతిపాదనలను లుట్నిక్ అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా నుంచి చైనాకు సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా నిరోధించేందుకు ట్రంప్ గత ఏడాది మూడుసార్లు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో అమలుకాలేదని కథనాలు పేర్కొన్నాయి. అమెరికా వాణిజ్య శాఖ నిర్వహించే ఎంటిటీ లిస్ట్‌లో చోటు దక్కిన సంస్థలకు అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కఠినంగా పరిమితం అవుతుంది. గతంలో ట్రంప్ తొలి పాలన, బైడెన్ హయాంలో పలు చైనా సంస్థలను ఈ జాబితాలో చేర్చారు. అయితే గత ఏడాది కాలంగా కొత్తగా ఒక్క సంస్థను కూడా చేర్చకపోవడం చైనాపై అమెరికా విధానంలో మార్పులను సూచిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!