

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ నిర్ణయాలపై డెమోక్రటిక్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న వేళ.. మిత్రదేశాలపై కొత్తగా సుంకాలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలు అమెరికా మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా, దేశంలోని కుటుంబాలు, కార్మికులపై ఆర్థిక భారాన్ని పెంచుతాయని ఆరోపించారు. డెమోక్రటిక్ సెనెటర్ చక్ షూమర్ మాట్లాడుతూ.. చైనా వాణిజ్య విధానాలపై దృష్టి పెట్టాల్సిన ట్రంప్ మిత్రదేశాలను దూరం చేసుకుంటున్నారని విమర్శించారు. జనవరిలో ఈ పరిస్థితి మారుతుందని ఆయన పేర్కొన్నారు.
పెన్సిల్వేనియా గవర్నర్ జాష్ షాపిరో కూడా ఎక్స్ వేదికగా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. గందరగోళంగా ఉన్న టారిఫ్ విధానాలు అమెరికన్ల ఖర్చులను పెంచుతాయని, మిత్రదేశాలతో సంబంధాలను బలహీనపరుస్తాయని విమర్శించారు. మరోవైపు, వాణిజ్య ఒప్పందం కుదరకపోతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం ఏకపక్ష సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయాన్ని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) వ్యతిరేకించింది. దీనికి ప్రతిగా ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ తెలిపారు. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే పప్పుదినుసులు, ఖనిజాలు, పానీయాలు, ఆహార ఉత్పత్తులపై ఈ సుంకాలు విధించాలని ఆయన సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!