

ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కులగణన వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. న్యాయనిపుణులు, అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంత్రివర్గంలో చర్చించి ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై గంగపుత్రుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వారితో చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. అలాగే, పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కులగణన ద్వారా బలహీనవర్గాలకు సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించినట్లే, ఇతర సంక్లిష్ట సమస్యలను కూడా న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని వివరించారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత గృహ విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను ప్రస్తావించారు. పండుగ సాయన్న వంటి బహుజన పోరాటయోధుల చరిత్రకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!