

విడుదల తేదీ: ఆగస్టు 15, 2026
నటీనటులు: వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు
దర్శకత్వం: భిక్షు
నిర్మాత: వెంకట్ యాదవ్
సంగీత దర్శకుడు: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంబంధిత లింక్స్: ట్రైలర్
కథ:
‘హుషార్ పిట్టలు’ కథ చిన్న గ్రామానికి చెందిన రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) అనే ఇద్దరు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. రవి పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌లోకి వస్తాడు. చిట్టి మాత్రం ఇంకా స్కూల్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడి, వారు కొన్ని హద్దులు దాటి ప్రవర్తించడం మొదలుపెడతారు. అయితే తమ పిల్లలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు వారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో రవి, చిట్టి తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? తల్లిదండ్రుల మాట విని వారు మారారా? ఈ అనుభవం ద్వారా వారు ఏం తెలుసుకున్నారు? టీనేజ్ యువత ప్రవర్తనపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ఏంటి? అనే అంశాలను సినిమా ద్వారా చూపించారు.
ప్లస్ పాయింట్లు:
‘హుషార్ పిట్టలు’లో మొదటగా చెప్పుకోవాల్సిన అంశం దర్శకుడు భిక్షు చేసిన బోల్డ్ ప్రయత్నం. టీనేజ్ యువత ప్రస్తుత పరిస్థితులు, వారు తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం వంటి అంశాలను నేరుగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రస్తుత తరంలో టీనేజ్ పిల్లలు కొన్ని విషయాల ప్రభావానికి ఎలా లోనవుతున్నారు అనే అంశాన్ని స్పష్టంగా చూపించారు. దీనికి కామెడీని జోడించడం కూడా సినిమాకు ప్లస్‌గా నిలిచింది. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కామెడీతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. వాసవి గణేశన్ తన తొలి సినిమాతోనే ధైర్యంగా నటించి ఆకట్టుకున్నారు. అన్ష్ కూడా తన పాత్రలో సహజంగా నటించాడు. అతని లుక్స్, నటన బాగున్నాయి. తల్లిదండ్రుల పాత్రల్లో గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి మంచి నటనను కనబరిచారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్లు:
సినిమాలో సందేశం బాగున్నప్పటికీ దాన్ని చెప్పే క్రమంలో చూపించిన బోల్డ్ కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇద్దరు టీనేజర్ల మధ్య సంబంధాన్ని చూపించిన విధానం కొన్ని సందర్భాల్లో మితిమీరినట్టుగా అనిపిస్తుంది. సోలోగా సినిమా చూసే ప్రేక్షకులకు ఈ అంశం పెద్ద సమస్య కాకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కలిసి చూడాలనుకునేవారికి కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లోపాలు కనిపిస్తాయి. వీటిని మరింత వివరంగా చూపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, కథాంశం ముందుగానే కొంత అర్థమయ్యేలా ఉండటంతో కథనం కొన్ని చోట్ల ఊహించగలిగే విధంగా సాగుతుంది.
సాంకేతిక విభాగం:
‘హుషార్ పిట్టలు’ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో పనిచేసిన వారిలో చాలామంది కొత్తవారే అయినప్పటికీ ప్రాజెక్ట్‌ను చక్కగా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలను డిజైన్ చేసిన విధానం, పాత్రలకు తగ్గట్టుగా ఉపయోగించిన కొన్ని బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ బాగున్నాయి. వాటిలోని సాహిత్యం కూడా కొన్ని సందర్భాల్లో మెప్పిస్తుంది. రుద్ర సాయి కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా సినిమాకు అనుగుణంగా ఉంది. దర్శకుడు భిక్షు తాను చెప్పాలనుకున్న సందేశాన్ని స్పష్టంగా అందించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కథను మరింత హార్డ్ హిట్టింగ్‌గా చూపించే ప్రయత్నంలో బోల్డ్ కంటెంట్ కొంత హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే దర్శకుడి పని మెప్పిస్తుంది.
తీర్పు:
మొత్తంగా చూసుకుంటే ‘హుషార్ పిట్టలు’లో దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం బాగా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుత తరంలో టీనేజ్ యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని సినిమా ద్వారా స్పష్టంగా చూపించారు. లీడ్ జంటతో పాటు తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన వారి పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సినిమాకు బలంగా నిలిచాయి. అయితే బోల్డ్ సన్నివేశాలు, కొన్ని లాజిక్ లోపాలు, ఊహించగలిగే కథనం కొంత నిరాశపరుస్తాయి. వీటిని పక్కన పెడితే ‘హుషారు పిట్టలు’ ఒక సందేశాత్మక యూత్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.5/5













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!