

బిగ్‌బాస్ తెలుగు 10 పదో రోజు ఎపిసోడ్‌లో దేబ్జానీ, ముకేష్ మధ్య మరోసారి ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. వీకెండ్ ఎపిసోడ్‌లోనే నాగార్జున ముందు ముకేష్ అంటే తనకు ఇష్టమని చెప్పిన దేబ్జానీ.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద ముకేష్.. దేబ్జానీని పొరపాటున వర్షిణి అని పిలవడంతో సరదా సంభాషణ మొదలైంది. వర్షిణితో కలిసి ముకేష్ పూల్‌లో ఉండటంపై దేబ్జానీ సరదాగా ప్రశ్నలు వేసింది. అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారని ముకేష్ వివరణ ఇవ్వగా.. దేబ్జానీ తనదైన శైలిలో ముకేష్‌ను ఆటపట్టించింది. రామ్ ప్రసాద్ మధ్యలో పంచ్‌లు వేయడంతో ఈ సన్నివేశం మరింత వినోదాత్మకంగా మారింది.
మరోవైపు నామినేషన్స్ సందర్భంగా జరిగిన వాగ్వాదానికి సంబంధించి త్రిగుణ్.. సృష్టితో మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సృష్టిని ‘గోడమీద పిల్లి’ అని వ్యాఖ్యానించడంపై త్రిగుణ్.. ఆ పదాన్ని గేమ్‌లో భాగంగానే ఉపయోగించానని, ఆమెను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. ఇదిలా ఉండగా రోహిత్ తన గేమ్ వ్యూహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. హౌస్‌లోకి రాకముందే కంటెస్టెంట్ల ఫ్యాన్ ఫాలోయింగ్, బలాలు, బలహీనతలు, ఎవరితో ఎలాంటి గేమ్ ఆడాలనే అంశాలను పరిశీలించినట్లు చెప్పాడు. త్రిగుణ్-వర్షిణి, త్రిగుణ్-ముకేష్ మధ్య వివాదాలు జరిగితే గేమ్ మరింత ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నాడు. త్రిగుణ్ టాప్ 5లో ఉండే అవకాశం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!