

బిగ్‌బాస్ తెలుగు 10లో నవంబర్ 10న ప్రసారమైన 65వ రోజు ఎపిసోడ్ వినోదం, భావోద్వేగాల కలయికగా సాగింది. బిగ్‌బాస్ హౌస్‌ను స్కూల్‌గా మార్చడంతో నరేశ్ ప్రిన్సిపల్‌గా, దేబ్జానీ తెలుగు టీచర్‌గా, వర్షిణి కెమిస్ట్రీ టీచర్‌గా, శ్వేత పీటీ టీచర్‌గా, నీతూ మాస్టర్ డ్యాన్స్ టీచర్‌గా వ్యవహరించారు. మిగతా కంటెస్టెంట్లు విద్యార్థులుగా మారి సరదా క్లాసుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కామెడీ సంభాషణలు, పాటలు, సరదా ఆటలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం నరేశ్ తమ్ముడు సురేశ్ హౌస్‌లోకి వచ్చాడు. తమ్ముడిని చూసిన నరేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న అతడు, నరేశ్ ఆటతీరును ప్రశంసిస్తూ ధైర్యంగా కొనసాగాలని సూచించాడు. దేబ్జానీతో కూడా మాట్లాడి ఇద్దరి మధ్య ఉన్న విభేదాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఆ తర్వాత శ్వేత కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. తొలుత తన పెంపుడు కుక్కల ఫొటోలను చూసి భావోద్వేగానికి గురైన శ్వేత, అనంతరం అక్కను, తండ్రిని కలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు ఆమెకు కొన్ని సూచనలు ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పారు. ఇక ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా వంశీ కుటుంబ సభ్యుల ఎంట్రీ నిలిచింది. వంశీ ఎనిమిదేళ్ల కూతురు ఆర్య శ్రీపాద హౌస్‌లోకి రావడంతో అతడు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత భార్య శిరీష కూడా రావడంతో ఇద్దరూ కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆర్య చలాకీతనం అందరినీ ఆకట్టుకోగా, ఆమె అడగడంతో వంశీ స్వయంగా ఎగ్ ఆమ్లెట్ తయారు చేసి పెట్టాడు. వంశీ, త్రిగుణ్ మధ్య ఉన్న స్నేహాన్ని శిరీష ప్రశంసించింది. తన తండ్రిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడటం చాలా సంతోషంగా ఉందని ఆర్య చెప్పింది. చివరగా స్కూల్ బోర్డుపై “ఐ లవ్ యూ నాన్న” అని రాయడంతో ఆ క్షణం మరింత ప్రత్యేకంగా మారింది. కుటుంబ సభ్యుల సందడి, ఆత్మీయ పలకరింపులతో ఎపిసోడ్ ముగిసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!