

వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో యూఏఈతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం ఓపెనర్ 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. ఆరంభంలో భారత జట్టు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినప్పటికీ, ఆర్యవీర్ క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 95.23 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు వీకే వినీత్ 69 బంతుల్లో 67 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 255 పరుగుల స్కోరు సాధించింది.
ఈ టోర్నీలో ఆర్యవీర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 126 సగటుతో 252 పరుగులు చేశాడు. 96.92 స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. నేపాల్‌పై 52 బంతుల్లో 70 పరుగులు చేసిన అతడు, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 22 పరుగులకే ఔటయ్యాడు. యూఏఈపై సాధించిన 160 పరుగులతో యువ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో అంబటి రాయుడు 177 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఆర్యవీర్ సాధించిన 160 పరుగులు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ స్కోర్లతో సమానంగా ఉన్నాయి. గిల్ 2017లో ఇంగ్లాండ్‌పై, మయాంక్ 2009లో ఆస్ట్రేలియాపై ఈ స్కోరు సాధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!